జాప్యం లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి -అపూర్వ భరత్
కాకినాడ, ఏప్రిల్ 9,(పిన్ పాయింట్)
జిల్లాలో వినియోగదారులకు జాప్యం లేకుండా వంటగ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఎల్పీజి డీలర్లను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితులు, వినియోగదారులకు అందుతున్న సేవలు, సరఫరాలో సమస్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు నిర్దిష్ట కాలవ్యవధిలో సిలిండర్లు డెలివరీ చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్లో ఓటిపి రాని డెలివరీలను నిలిపివేయాలని జేసీ సూచించారు. ముఖ్యంగా అయా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు ఇప్పటికే పంపిణీ చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించారు. సిలిండర్ల లోడు అన్ని ఏజెన్సీలకు సమానంగా పంపిణీ చేయాలని ప్రాధాన్యత క్రమంలో డెలివరీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వలస కూలీలకు మాత్రమే ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేయాలని, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రాధాన్యత సంస్థలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయ్యేలా చూడాలని జేసీ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, ఏఎస్వో టి లక్ష్మి ప్రసన్న దేవి, సీఎస్డీటీలు, ఆయా ఎల్పీజీ గ్యాస్ డీలర్స్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



