పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి -జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్
కాకినాడ రూరల్, మే 6,(పిన్ పాయింట్ )
రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ముందుగా పోలీసు సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కాకినాడ జిల్లా ఎస్పీజి. బిందుమాధవ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు మరియు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.విధి నిర్వహణలో నిరంతరం రోడ్లపై ఉండే ట్రాఫిక్-1, ట్రాఫిక్-2 స్టేషన్ల సిబ్బందికి ఎస్పీ స్వయంగా హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది కేవలం జరిమానాల నుండి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని గుర్తు చేశారు. పోలీసులే స్వయంగా హెల్మెట్లు ధరించి విధులకు హాజరవడం ద్వారా ప్రజల్లో సానుకూల మార్పు వస్తుందని ఆయన ఆకాంక్షించారు.
హోరెత్తిన హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ
హెల్మెట్లు పంపిణీ చేసిన అనంతరం, పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన జంక్షన్ల మీదుగా సాగింది.ఈ సందర్భంగా"హెల్మెట్ ధరిద్దాం – ప్రాణాలు కాపాడుకుందాం" అనే నినాదంతో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.వాహనం నడిపేవారే కాకుండా, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.
దాతలకు అభినందనలు
పోలీసు సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేయడానికి సహకరించిన స్థానిక హోండా, బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, హీరో హోండా, స్టార్ అండ్ స్టార్ షోరూంల యాజమాన్యాలను ఎస్పీ అభినందించారు. అలాగే పోలీసుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసిన అన్నమ్మ ఘాటీ మెడికల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకినాడ (ఏఆర్) అదనపు ఎస్పీఎస్. శ్రీనివాసరావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రమేష్, డి. రామారావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.



