కాకినాడ రూరల్, జూలై 27,(పిన్ పాయింట్) రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ఏపీని తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి నెట్టేసిందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విఫల విధానాలు, ఆర్థిక లోటు, రైతాంగ సమస్యలు మరియు తీవ్రమైన శాంతిభద్రతల క్షీణతపై ఆయన నిప్పులు చెరిగారు.​కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కన్నబాబు విమర్శించారు. తెచ్చిన అప్పుల నుంచి మూలధన వ్యయం కేవలం 23 శాతం మాత్రమే చేశారని, ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయకపోతే మిగిలిన రూ 68 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఏకంగా రూ 62 వేల కోట్ల రెవెన్యూ లోటు నమోదైతే దానికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఘోరంగా పడిపోయిందని, జి ఎస్ టి వాటా తగ్గి రూ.34,900 కోట్ల దాకా నష్టం జరిగిందని తెలిపారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతికి డబ్బులు ఇవ్వడం వల్ల కొనుగోలు శక్తి పెరిగిందని, కానీ నేడు ఆ పరిస్థితి మాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు.బీహార్‌ లాంటి రాష్ట్రం 18శాతం వృద్ధి నమోదు చేస్తుంటే, మన రాష్ట్రం 22శాతం నష్టాల దిశగా పడిపోవడం చంద్రబాబు "సంపద సృష్టి" డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు.రాష్ట్రంలో రైతాంగం, కార్మికులు, పొగాకు ఉత్పత్తిదారులు సహా అన్ని వర్గాలు కూటమి పాలనలో తీవ్రంగా దెబ్బతిన్నాయని కన్నబాబు పేర్కొన్నారు. ఎల్ నినో తుఫాను ప్రభావం ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వరి పంట వేయవద్దని చెప్పడం దారుణమన్నారు. క్రోప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు నష్టపరిహారం ఎవరు ఇస్తారని, ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందిస్తుందని ప్రశ్నించారు.జగన్ హయాంలో ప్రతి మండలంలో వ్యవసాయ మండలులు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచామని, కానీ నేడు కరువు పరిస్థితుల్లో నీరు లేక రైతులు అల్లాడుతున్నా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం లేదని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా ధరల స్థిరీకరణ నిధిని వాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.​కేంద్ర ప్రభుత్వ గణాంకాలే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయని మాజీ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. 2024-25, 2025-26 సంవత్సరాల్లో వేల సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు.గతంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ, నేడు 8వ స్థానానికి పడిపోయిందని, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల వల్ల రూ 6,500 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయని ఆరోపించారు.ఎకరం కేవలం 99 పైసలకే వందల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేస్తున్నారని, తప్పుడు నిర్ణయాల వల్ల దాదాపు 46 వేల పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు.​రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. పోలీసులను ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు, వేధింపులకు విచ్చలవిడిగా వాడుకుంటున్నారే తప్ప శాంతిభద్రతల పరిరక్షణను పట్టించుకోవడం లేదన్నారు. ఫలితంగా నేరాలు, అవినీతి పెరిగిపోయాయని, మహిళల భద్రత గాలికి వదిలేశారని ఆరోపించారు.విద్యాశాఖ మరియు ఉద్యోగ నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం యువతను దారుణంగా వంచించిందని కన్నబాబు ధ్వజమెత్తారు.డీఎస్సీ నిర్వహణ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే వెంటనే డీఎస్సీ స్కామ్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.​కేంద్రం నుంచి రావలసిన నిధులను తీసుకురావడంలో విఫలమై, ద్రవ్యోల్బణం వైపు రాష్ట్రాన్ని నెడుతూ, కేవలం ప్రచార ఆర్భాటాలు, భ్రమలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజల్లో ఎండగడతామని కన్నబాబు హెచ్చరించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి