పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత - ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
కాకినాడ, జూలై 27,(పిన్ పాయింట్)
పర్యావరణ పరిరక్షణకు సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో కాకినాడలోని చేయూత చిల్డ్రన్ హోమ్ ప్రాంగణంలో "పది వేల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం" అత్యంత ఘనంగా, విజయవంతంగా జరిగింది. చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ డివిజన్ అటవీ శాఖ అధికారి (డి.ఎఫ్.ఓ) ఎన్. రామచంద్రరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ... ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంచడమే కాకుండా, భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొనియాడారు.
చేయూత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. రవి కుమార్ మాట్లాడుతూ... "ఒక సీడ్ బాల్... ఒక చెట్టు... ఒక పచ్చని భవిష్యత్తు" అనే ఆశయంతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో తయారైన పది వేల సీడ్ బాల్స్‌ను రాబోయే వర్షాకాలంలో అనువైన ఖాళీ ప్రాంతాల్లో చల్లి, పచ్చదనాన్ని విస్తరించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు, వివిధ రంగాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు మరియు చేయూత సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు మరియు మీడియా ప్రతినిధులకు సొసైటీ ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



