- ​రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన బ్యాంక్ • ​డిపాజిట్లు రూ. 1000 కోట్లు దాటడంతో 'టైర్-3' హోదా సొంతం • ​సభ్యులకు 12 శాతం డివిడెండ్ ప్రకటన • వరుసగా ఎ గ్రేడ్ కైవసం ​కాకినాడ, జూన్ 29,(పిన్ పాయింట్) ప్రముఖ సహకార రంగ సంస్థ ‘ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్’ ఆర్థిక వృద్ధిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. 1980లో ప్రారంభమైన ఈ బ్యాంక్, ప్రస్తుతం 18 బ్రాంచీలతో 46 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు 31 నాటికి ఆడిట్ చేయబడిన బ్యాంక్ వార్షిక ఆర్థిక వివరాలను సోమవారం స్థానిక ఒక హోటల్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర, వైస్ ప్రెసిడెంట్ తోట సుధీర్, సీఈఓ సి సుగుణ రావు లు వివరించారు. ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 46 సహకార కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో, కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రూ. 2040 కోట్ల భారీ టర్నోవర్‌తో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించిందని,100 సంవత్సరాల చరిత్ర గల బ్యాంకులు సాధించిన ఇటువంటి ఉన్నత స్థానాన్ని, ఈ బ్యాంక్ కేవలం 47 ఏళ్ల వ్యవధిలోనే అందుకోవడం విశేషమన్నారు. ఈ సంవత్సరం మే 31 నాటికి బ్యాంక్ మొత్తం బిజినెస్ టార్గెట్ రూ. 2000 కోట్లుగా నిర్ణయించుకోగా, నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి రూ. 2040 కోట్లకు చేరుకుంది. దీంతో రిజర్వు బ్యాంక్ దృష్టిలో 'టైర్-3' బ్యాంకుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. ఈ సంవత్సరం మే 31 నాటికి ​మొత్తం డిపాజిట్లు రూ. 1235.56 కోట్లు ఉండగా రూ. 804.12 కోట్లుమొత్తం రుణాలు,రూ. 352.14 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీలలో రూ. 401.05 కోట్లు, ఇతర బ్యాంకులలో రూ. 151.09 కోట్లు ఉన్నాయని తెలిపారు. 55,605 మంది సభ్యులతో రూ. 28.63 కోట్ల షేర్ క్యాపిటల్ ఉన్నట్లు బ్యాంకు సొంత నిధులు రూ. 198.20 కోట్లు ఉన్నట్లు తెలిపారు.​ఆదాయపు పన్ను ప్రొవిజన్ కింద రూ. 5.61 కోట్లు చెల్లించిన అనంతరం, బ్యాంక్ రూ. 16.18 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన నెట్ ఎన్‌పీఏ గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా 0.00 శాతంగా గా నమోదు కావడం బ్యాంక్ యొక్క అద్భుత ఆర్థిక నిర్వహణకు నిదర్శనంఅన్నారు. నిబంధనల ప్రకారం ఇది 3 శాతం దాటకూడదని అలాగే బ్యాంక్ భద్రతను సూచించే రేషియో 18.23 శాతం గా ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 9 శాతం పైగా, క్షేమకరంగా ఉండాలంటే 12శాతం పైగా ఉండాలి. ఈ నేపథ్యంలో 18.23 శాతం సాధించిన కాకినాడ టౌన్ బ్యాంక్‌ను అత్యంత పటిష్టమైన బ్యాంకుగా పరిగణిస్తున్నట్లు ఈ అద్భుత ప్రగతికి గాను బ్యాంకు ఈ ఏడాది కూడా ఎ గ్రేడ్ సాధించగా, సభ్యులకు 12 శాతం డివిడెండ్ ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపిందన్నారు. ​అత్యాధునిక సాంకేతిక సేవలు.. ఒరాకిల్‌తో ఒప్పందం ​సహకార రంగంలో ఉన్నప్పటికీ కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఈ బ్యాంక్ సాంకేతిక సేవలను అందిస్తోంది. డిసెంబర్ 2012 నుంచే 'కోర్ బ్యాంకింగ్ సిస్టమ్'ను ప్రవేశపెట్టిన ఈ సంస్థ, ఖాతాదారులకు ఆర్ టి జి ఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, నాచ్ , యూపీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు గూగుల్ పే, ఫోన్ పే లాంటి డిజిటల్ లావాదేవీల సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుకు 8 ఏటీఎంలు, ఒక క్యాష్ డిపాజిట్ మెషిన్ అందుబాటులో ఉన్నాయని,భద్రతా పరంగా ఆర్‌బీఐ సూచనల మేరకు విశాఖపట్నంలో 'డిజాస్టర్ రికవరీ సెంటర్'ను కూడా ఏర్పాటు చేశామన్నారు.అదేవిధంగా ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించిన ఇన్స్పెక్షన్ సూచనల మేరకు సొంత డేటా సెంటర్ స్థానంలో మరింత సురక్షితమైన క్లౌడ్ సాంకేతికత కోసం ప్రముఖ ఒరాకిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.సైబర్ సెక్యూరిటీ పరంగా ఆర్‌బీఐ ఆదేశాల మేరకు అన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.​బ్యాంకుకు సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు రామ రావు పేట, జగన్నాధపురం, ఇంద్రపాలెం, అశోక్ నగర్, సామర్లకోట, రామచంద్రపురం బ్రాంచీలు సొంత భవనాలలోనే నడుస్తూ సంస్థ యొక్క స్థిరత్వాన్ని చాటుతున్నాయని ,ఖాతాదారుల నమ్మకం, పాలకవర్గ సమర్థత వల్లే ఈ అసాధారణ వృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి