కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు - హోం మంత్రి అనిత రాజీనామా చేయాలి. -జమ్మలమడక నాగమణి డిమాండ్
కాకినాడ రూరల్, ఆగస్టు 9,(పిన్ పాయింట్)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షరాలు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్రంలో మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని, బాధితులకు జైళ్లు.. నిందితులకు బైళ్లు ఇచ్చే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు.రాజమండ్రిలో పీజీ వైద్యురాలిపై మద్యం మత్తులో ఉన్న ఉన్మాదులు కారుతో ఢీకొట్టి హత్యాప్రయత్నం చేస్తే, ప్రభుత్వం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు.పక్క రాష్ట్రాల్లో సంఘటనలు లేదా ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేసేందుకు ముందుకు వచ్చే హోం మంత్రి అనిత, రాజమండ్రి ఘటనపై నోరు మెదపకపోవడం విచారకరమని, తక్షణమే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి నేతలు మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. గంజాయి మూలాలు తెలుసన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడిని విచారించాలని సూచించారు.మహిళలకు భద్రత కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 'దిశ' చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో మహిళల్లో అభద్రతాభావం పెరిగిందన్నారు.
బాధితులపైనే అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే విరూపాక్ష, మాజీ మంత్రి విడదల రజనీల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు హేయమైనదని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు.



