కాకినాడలో భారీ చోరీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్.. రూ 50 లక్షల సొత్తు రికవరీ.
కాకినాడ రూరల్, మే 7,(పిన్ పాయింట్)
కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లు, గృహ చోరీలు మరియు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50.16 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జి. బిందుమాధవ్, ఈ వివరాలను వెల్లడించారు.ఎస్పీ కథనం ప్రకారం.. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో క్రైమ్ సిఐ వి. కృష్ణ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ ఈ కేసులను ఛేదించిందని తెలిపారు.
కాకినాడ టూ టౌన్ పరిధిలో పట్టుబడిన ఇద్దరు నిందితుల నుంచి 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, రూ. 40,000 నగదు మరియు ఒక బైక్‌ను రికవరీ చేసామని వీటి విలువ రూ. 46.50 లక్షలు ఉంటుందన్నారు.సర్పవరం పోలీసుల ఆధ్వర్యంలో పట్టుబడిన మరో నిందితుడి నుంచి 430 గ్రాముల వెండి మరియు మూడు మోటార్ సైకిళ్లను మొత్తం మీద కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 7 చైన్ స్నాచింగ్‌లు, 2 ఇంటి నేరాలు, 2 బైక్ దొంగతనాలు, 1 ఏటీఎం మోసం ఒకేసారి పరిష్కరించామనీ తెలిపారు.అరెస్ట్ అయిన వారిలో కరుడుగట్టిన నేరస్తులైన కోనసీమ జిల్లాకు చెందిన పల్లా సురేంద్ర కుమార్,కాకినాడకు చెందిన రంగాల శ్రీనివాసరెడ్డి,కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన
రచ్చ నాగ సతీష్ కుమార్ (బబ్లు) వీరందరిపై జిల్లాలో ఇతర జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయి ఉన్నాయని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ముద్దాయిలు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాల బాట పట్టారని, జనసంచారం తక్కువగా ఉన్న చోట ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులు తెంచుకుపోవడం, ఏటీఎంల వద్ద వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటించి కార్డులు మార్చడం, తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడటం వీరి ప్రధాన శైలి అని తెలిపారు.నేరాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు నగలు కనిపించకుండా జాగ్రత్త పడాలని,ఏటీఎం పిన్ నంబర్లను అపరిచితులకు చెప్పకూడదన్నారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని సూచించారు
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ వి. కృష్ణ, ఎస్ఐలు బుజ్జిబాబు, ఏసుబాబు మరియు ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.



