భీమవరం, ఏప్రిల్ 6,(పిన్ పాయింట్) తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని, నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి ఏకంగా రూ. 2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ  అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పోలీసులు నిఘా ఉంచారు. బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపి చంద్ర రెడ్డి, జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహన సాయి, బర్రె సుధీర్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అమాయకులకు గాలం వేస్తున్నారు. తమ వద్ద ఉన్న నోట్లను ఇస్తే, దానికి మూడు రెట్లు అధికంగా నగదు ఇస్తామని నమ్మబలికేవారు. ​భీమవరానికి చెందిన ఒక వ్యక్తి నుండి రూ. 3 లక్షలు కాజేసేందుకు ప్రయత్నిస్తుండగా, భీమవరం వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగరాజు, ఎస్సైలు కిరణ్ కుమార్, కృష్ణాజి మరియు సిబ్బంది ఏఎంసీ మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ సమీపంలో నిందితులను పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి నుండి ​రూ. 2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ చిల్డ్రన్ బ్యాంక్ అని ముద్రించిన 400 కట్టలు.,18 డమ్మీ నోట్ల కట్టలు, ఎనిమిది 500 రూపాయల అసలు నోట్లు. ​నేరానికి ఉపయోగించిన కారు మరియు రెండు నకిలీ నంబర్ ప్లేట్లు. స్వాధీనం చేసుకొని ​నిందితులపై భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా,  న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండ్ విధించింది.అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు వస్తుందనే ప్రలోభాలకు లోనై ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని, ఎవరైనా ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లతో మిమ్మల్ని సంప్రదిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని భీమవరం వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగరాజు ప్రజలకు సూచించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి