ప్రజల కష్టాలపై ముందుచూపు లేని 'విజనరీ' బాబు -వైకాపా నేత నాగమణి ధ్వజం
కాకినాడ రూరల్, మార్చి 25(పిన్ పాయింట్)పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న 'విజన్' ఎక్కడకు పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. మంగళవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
యుద్ధం కారణంగా ముంచుకొస్తున్న పరిణామాలను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగమణి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమె ప్రధానంగా పలు
అంశాలను లేవనెత్తారు.వంట గ్యాస్ సిలిండర్లు లభించక పేద, మధ్యతరగతి గృహిణులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల అండదండలతో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని ఆమె ఆరోపించారు.పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని, పెట్రోల్, డీజిల్ దొరకక ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ఆమె నిలదీశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనైనా ఆ హామీని నెరవేర్చి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు అవసరమైన పప్పు, ఉప్పు, గ్యాస్ దొరకడం లేదు కానీ, బాబు గారి 'విజనరీ' పాలనలో మద్యం మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోందని నాగమణి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుతున్నారే తప్ప, సామాన్యుడి ఆకలి తీర్చే దిశగా అడుగులు పడటం లేదని విమర్శించారు.
రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు."2019-2022 మధ్య కాలంలో ప్రపంచాన్ని కోవిడ్ వణికించినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా రక్షణ కవచంలా నిలిచారు. ఒకవేళ ఆ సమయంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉండి ఉంటే, ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యేదని ఆమె అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు తగ్గించి, యుద్ధం వల్ల తలెత్తిన నిత్యావసరాల కొరతను తీర్చడంపై దృష్టి సారించాలని నాగమణి డిమాండ్ చేశారు.



