రామచంద్రపురంలో డిజిటల్ సేవల విప్లవానికి శ్రీకారం -మీ సేవ /సిఎస్సి డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం, మార్చి 21,(పిన్ పాయింట్)
రామచంద్రపురం పట్టణంలో డిజిటల్ సేవలు (మీసేవ) కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సాధికారికత లక్ష్యంగా ఈ డిజిటల్ సేవలను(డిజి -లక్ష్మి) పేరుతో ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిటిజన్ సర్వీస్ సెంటర్ లు గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించే ముఖ్య కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, విద్యాసంస్థల సేవలను ప్రజలకు చేరవేసే ఐటి ఆధారిత సేవా కేంద్రాలుగా ఇవి ఉపయోగ పడతాయని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు డిజిటల్, ఆర్థిక సేవలను అందించి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో సి ఎస్ సి లు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
ఈ సెంటర్ ద్వారా ప్రధానమంత్రి వెల్ఫేర్ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, జనన, మరణ ధృవపత్రాలు, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు సేవలు, డ్రైవింగ్ లైసెన్స్, రైల్వే టికెట్లు, విమాన టికెట్లు, ఆరోగ్య సేవలు వంటి 256 రకాల సేవలను ఒకే చోట ప్రజలు పొందవచ్చని తెలిపారు.
అలాగే ఆసక్తి ఉన్న మహిళలకు డిజిటల్ సేవలపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందే అవకాశాలు కల్పించడంతో పాటు, మహిళా సాధికారికతకు మెప్మా ద్వారా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ షాపు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకురాలు అనూష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, మీసేవ /సిఎస్సి నిర్వహకురాలు రామిశెట్టి అనూష, గడి గోవిందు, కట్ట నాగేశ్వరరావు, చింతాకుల వీర ప్రకాష్, రెడ్డి సురేష్, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.



